
తెలుగులోనే ఛార్జ్ షీట్: పోలీస్ శాఖలో సరికొత్త మార్పు
దుండిగల్: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాలు అంటే సాధారణంగా ఇంగ్లీష్లోనే ఉంటాయనే అభిప్రాయానికి భిన్నంగా, సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలోనే అభియోగపత్రం (చార్జ్ షీట్) దాఖలు చేసి ప్రశంసలు అందుకున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్వరూప.

ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని బాధితులు, ఫిర్యాదుదారులు కూడా కేసు వివరాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో, 2025 సంవత్సరంలో రెండు కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులోనే సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. ఈ చర్య పోలీస్ శాఖలో ఒక కొత్త దిశగా భావిస్తున్నారు.
అలాగే, ఒక మిస్సింగ్ కేసును సత్వరంగా ఛేదించి, తల్లి–బిడ్డలను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తుతో న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఏసీపీ శంకర్ రెడ్డి సహకారంతో మేడ్చల్ కోర్టులో తెలుగు భాషలో అభియోగపత్రాలను దాఖలు చేయడం విశేషంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను, ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మరియు ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ప్రశంసలు అందుకున్నారు.
మాతృభాషలో న్యాయం అందించే దిశగా చేపట్టిన ఈ ప్రయత్నం, భవిష్యత్తులో ఇతర పోలీస్ స్టేషన్లకూ ఆదర్శంగా నిలవనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
