
మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితాల ఖరారు షెడ్యూల్ విడుదల – జనవరి 10న తుది ప్రచురణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలూ, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వార్డు వారీ ఓటరు జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. డిసెంబర్ 29, 2025 తేదీతో జారీ చేసిన నోటిఫికేషన్లో భాగంగా, 117 మున్సిపాలిటీలు మరియు 6 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ స్టేషన్ వారీ ఓటరు జాబితాల తుది ప్రచురణను జనవరి 10, 2026న చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 30 నుంచి పోలింగ్ స్టేషన్ డేటాను మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ వారీగా పునర్వ్యవస్థీకరించనున్నారు. డిసెంబర్ 31న వార్డు వారీగా డేటా సిద్ధం చేయనుండగా, జనవరి 1న డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను నోటిస్ బోర్డులపై ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించనున్నారు.
జనవరి 5న మున్సిపాలిటీ స్థాయిలో, జనవరి 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం అభ్యంతరాల పరిష్కారం అనంతరం జనవరి 10న తుది ఓటరు జాబితాలు ప్రచురించబడతాయి.
అక్టోబర్ 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని, అసెంబ్లీ నియోజకవర్గాల తాజా ఓటరు జాబితాల ఆధారంగా మున్సిపల్ ఓటరు జాబితాలు రూపొందించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అన్ని వార్డుల ఓటరు జాబితాలు అసెంబ్లీ ఓటరు జాబితాల మాదిరిగానే అదే ఫార్మాట్, భాషల్లో ఉంటాయని తెలిపింది.
ఈ షెడ్యూల్తో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటరు జాబితాల ప్రక్రియ స్పష్టతకు వచ్చింది.
