
నకిలీ నల్లా బిల్లు SMSలు… అప్రమత్తంగా ఉండండి: జలమండలి హెచ్చరిక
హైదరాబాద్ జలమండలికి అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న నకిలీ సందేశాలపై ఫిర్యాదులు చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి “నెలవారీ నల్లా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ను నిలిపేస్తాం” అంటూ వినియోగదారులకు తప్పుడు సమాచారం పంపుతున్నారని జలమండలి వెల్లడించింది.
కొన్ని నంబర్ల నుంచి బాకీ బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, అదనంగా మరిన్ని వివరాలకు మరో నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. ఆ నంబర్‌ను సంప్రదించగానే “ప్రాసెసింగ్ కోసం” అంటూ ఒక APK ఫైల్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు గుర్తించారు.
ఇలాంటి సందేశాలు, APK ఫైళ్లు ఏవీ జలమండలికి సంబంధించినవి కావని స్పష్టంచేసిన అధికారులు, ప్రజలు వీటికి స్పందించకుండా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని నంబర్లకు ఫోన్ చేయకూడదని, వాట్సాప్‌లో వచ్చే APK ఫైళ్లు ఏ పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేయవద్దని హెచ్చరించారు.
జలమండలికి సంబంధించిన అధికారిక సమాచారం పత్రికలు, టీవీ చానెల్లు వంటి అధికారిక మార్గాల ద్వారానే విడుదలవుతుందని స్పష్టం చేసింది. సేవా సంబంధిత సందేహాలు, ఫిర్యాదుల కోసం కస్టమర్ కేర్ 155313 ను సంప్రదించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.
