
కర్నూలు సమీపంలో విషాదం — వోల్వో బస్సు అగ్నికి ఆహుతి, 20 మంది దుర్మరణం
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు దగ్ధమై 20 మంది వరకు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్‌కు చెందిన (నంబర్ DD01N9490) బస్సు ఉదయం 3.30 గంటల సమయంలో ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి భారీగా అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలో ఉండడంతో చాలామంది సజీవదహనం అయ్యారు.
బస్సులో మొత్తం 42 మంది ఉన్నారని, వారిలో 20–25 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలిగారని, 20 మంది వరకు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ మృతిచెందారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
ప్రమాదం తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్, సహాయక డ్రైవర్ పరారయ్యారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టిన తర్వాత వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలించలేదన్నారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ప్రమాదం నుంచి బయటపడినవారిలో సత్యనారాయణ (సత్తుపల్లి), జైసూర్య (మియాపూర్), నవీన్‌కుమార్ (హయత్‌నగర్), సరస్వతి హారిక (బెంగళూరు), నేలకుర్తి రమేశ్ (నెల్లూరు), కటారి అశోక్ (రంగారెడ్డి), ముసునూరి శ్రీహర్ష (నెల్లూరు), పూనుపట్టి కీర్తి (హైదరాబాద్), వేణుగోపాల్‌రెడ్డి (హిందూపురం), రామిరెడ్డి (ఈస్ట్ గోదావరి) ఉన్నారు.
ప్రస్తుతం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
