
గ్రామాల్లో నాటు సారా, పేకాట అడ్డాలు విరివిగా: అధికారుల కఠిన చర్యల కోసం ప్రజల డిమాండ్
జూలూరుపాడు, సెప్టెంబర్ 04 (జిందగీ9న్యూస్): మండల పరిధిలోని అనేక గ్రామాల్లో నిషేధిత నాటు సారా తయారీ, పేకాట జూదాలు ఆరాటంగా కొనసాగుతున్నాయి. అధికారులు పలుమార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రిపూట రహస్యంగా నాటు సారాను తయారు చేసి గ్రామాల్లో విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రివరకు పేకాట స్థావరాలు కిటకిటలాడుతుండటంతో గ్రామాల్లో చెడు అలవాట్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని, కొందరు మత్తు పదార్థాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నాటు సారా, పేకాట వ్యసనాలను అరికట్టేందుకు అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.
