కార్పొరేట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలి: సీఎం రేవంత్ రెడ్డి
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రతి సంవత్సరం కనీసం ఒక నెలరోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి సేవలు అందిస్తే వైద్య వృత్తిలో సంతృప్తి లభిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) నూతన ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కార్పొరేట్ వైద్యులు ప్రభుత్వ రంగానికి సేవలు అందించేందుకు సరైన వేదిక లేదని, దానికి అనుగుణంగా ఒక వ్యవస్థ ఏర్పాటుకు అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
అమెరికాలో నివసిస్తున్న డాక్టర్లు స్వస్థలానికి వచ్చినప్పుడు సేవలందించేందుకు సరైన ప్లాట్‌ఫామ్ లేకపోవడం వల్ల, అలాంటి వేదిక ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రికి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.3000 కోట్లతో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే నిమ్స్‌లో 2000 పడకల విభాగం, వరంగల్, అల్వాల్, ఎల్బీ నగర్, సనత్‌నగర్‌లో కలిపి 7000 పడకలతో ఆసుపత్రులు నిర్మించనున్నట్లు తెలిపారు.
వైద్య ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. CMRF కింద ఇప్పటివరకు రూ.1400 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. బడ్జెట్లో వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యకు రూ.21,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని కోటి మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, ప్రతి ఒక్కరికి యూనిక్ హెల్త్ ఐడీ కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మహిళలలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండడంతో నివారణ చర్యల్లో భాగంగా హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలనుకుంటున్నామని వివరించారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఆరోగ్య రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, ఇందులో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర రెడ్డి భాగస్వామ్యమవ్వాలని ఆకాంక్షించారు. ఇటీవలే ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును రాష్ట్ర సలహాదారుగా నియమించామని తెలిపారు.
డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో నిర్మితమైన AIG ఆసుపత్రి ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల రోగులను ఆకర్షించడం రాష్ట్రానికి గర్వకారణంగా పేర్కొన్నారు. AIG రూపొందించిన జననీ మిత్ర యాప్‌ను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రపంచంలో జపాన్ దేశంలో నర్సింగ్కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మన యువతకు జపనీస్ భాషను నేర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. “భారత్ వెనుకబడిన దేశం కాదు – ఎన్నో రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శకమవుతోంది” అని సీఎం పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

