హైదరాబాద్, మే 8 (zindagi9news):హైదరాబాద్ నగర హయాతిని కాపాడేందుకు, వర్షాలు, వరదలు, ఆక్రమణలు, కాలుష్యానికి తావులేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నగర వారసత్వ సంపదను కాపాడే దిశగా, ప్రకృతి పరిరక్షణతో కూడిన ప్రగతి దిశగా అడుగులు వేయాలని అన్నారు.
ట్యాంక్‌బండ్‌లోని బుద్ధభవన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (HYDRAA) పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. హైడ్రాకు కేటాయించిన 122 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించడంతో పాటు, హైడ్రా అధికార వెబ్సైట్ ను ఆవిష్కరించారు.
సమావేశంలో సీఎం మాట్లాడుతూ, “హైడ్రా అనేది కేవలం పేదల ఇండ్లపై దాడి చేయడానికే కాదు. ఇది శాఖల సమన్వయ లోపాలను అధిగమించేందుకు, విపత్తుల సమయంలో సమర్థంగా స్పందించేందుకు రూపొందించిన వ్యవస్థ” అన్నారు.
హైడ్రా చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో –
🔹ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల తొలగింపు
🔹నాలాల పునరుద్ధరణ
🔹నీటి కాలుష్యం నివారణ
🔹వర్షాలు, వరదల సమయంలో సహాయక చర్యలు
🔹ప్రజల ఫిర్యాదుల పరిష్కారం ఉన్నాయి.
“హైడ్రాలో పనిచేసేవారు కేవలం ఉద్యోగస్తులు కాదు – వారు మానవతావాదులుగా వ్యవహరించాలి. పేదవారి పట్ల ప్రేమతో, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి. పేదవారికి ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తాం,” అని స్పష్టంచేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఇది ఓల్డ్ సిటీ కాదు – ఒరిజినల్ సిటీ. దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన మెట్రో నగరాలు నివసించడానికి అనర్హమవుతున్న తరుణంలో, హైదరాబాద్‌ను మిగిలిన నగరాలకు గుణపాఠంగా మార్చాలి,” అన్నారు.
మూసీ నది పునరుజ్జీవనంపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “421 చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని ప్రక్షాళన చేయాలి. పేదల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యం. అవసరమైతే వారికి కొత్త ఇళ్ల పట్టాలు ఇస్తాం,” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
