హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేపట్టిన న్యాయపోరాటం విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తేల్చి చెప్పిన తీర్పు నేపథ్యంలో, కోర్టు విధించిన రూ.30 లక్షల జరిమానాను సోమవారం చెన్నమనేని రమేష్ తన న్యాయవాది ద్వారా హైకోర్టులో అందజేశారు. ఇందులో పిటిషనర్ అయిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
ఈ కేసులో సీనియర్ కౌన్సిల్ వి. రవికిరణ్ రావు, వి. రోహిత్ రావు లు ఆది శ్రీనివాస్ తరఫున వాదనలు వినిపించారు. డిసెంబర్ 9, 2024న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వెలువరించిన తీర్పులో చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, ఆయన జర్మన్ పౌరుడు అని స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలతో పదిహేనేళ్ల పాటు న్యాయస్థానాలను మరియు ప్రభుత్వ అధికారులను మోసం చేశాడని హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
2009లో వేములవాడ నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని, నిబంధనలకు విరుద్ధంగా పదిహేనేళ్ల పాటు భారత చట్టసభల్లో సభ్యుడిగా కొనసాగారని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం 2019లో చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయగా, దాని పై అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఐదేళ్ల విచారణ అనంతరం, కోర్టు చెన్నమనేనిని తప్పుబట్టింది.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “చెన్నమనేని నాలుగు సార్లు మోసం చేసి గెలిచాడు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశాను. వేములవాడ ప్రజలకు చెన్నమనేని క్షమాపణ చెప్పాలి. 2009 నుండి 2023 వరకు అతను ఎమ్మెల్యే కాదని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కూడా అతనికి అందకుండా చూడాలి,” అని పేర్కొన్నారు.
తన న్యాయ పోరాటంలో తోడుగా ఉన్న సీనియర్ న్యాయవాదులు వి. రవికిరణ్ రావు, వి. రోహిత్ రావులకు ధన్యవాదాలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
