హైదరాబాద్: రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ స్థాపనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఆయన తెలంగాణ విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, తీసుకురావలసిన సంస్కరణలపై ఐసీసీసీ లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన ఆయన, ఉపాధ్యాయుల నియామకం, ‘అమ్మ ఆదర్శ కమిటీలు’, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) నిర్మాణంపై వివరించారు.
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డ సీఎం, అంగన్వాడీలు మరియు ప్రాథమిక పాఠశాలల స్థాయిలో సంస్కరణల కోసం సమాజంలోని వివిధ వర్గాల నేతలతో చర్చించి విధాన పత్రం రూపొందించాలని సూచించారు.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిర్వహించిన ప్రెజెంటేషన్‌లో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న శ్రేష్ఠమైన విద్యా నమూనాలు ప్రస్తావించారు. అలాగే ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డా. జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా జేపీ) 1960ల నుండి ఇప్పటి వరకూ తీసుకువచ్చిన విద్యా సంస్కరణలపై విశ్లేషణ ఇచ్చారు. విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతినకుండా ఉండే విధానాలపై సూచనలు చేశారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, కే. కేశవరావు, విద్యా కమిషన్ సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, డా. చారుకొండ వెంకటేష్, కె. జ్యోత్స శివా రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
