జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అనుమతి లేకుండా స్థానిక సెలవును ప్రకటించడంతో వివాదం నెలకొంది. గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా, స్థానిక సెలవులు గ్రామ జాతర లేదా ఇతర ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఈసారి ఊరిలో జాతర శనివారం జరగనున్నప్పటికీ, ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ (మండల విద్యాధికారి) అనుమతి లేకుండానే గురువారమే సెలవును ప్రకటించారు.
ఈ విషయంపై మండల విద్యాధికారి స్పందిస్తూ, తనకు ఈ సెలవుపై ఎలాంటి సమాచారం లేదని, ప్రధానోపాధ్యాయులు స్వయంగా సెలవును ప్రకటించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. అంతేకాక, తనను సమాచారం లేకుండా సెలవు ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించిన ప్రధానోపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జిల్లా విద్యాధికారిని తక్షణమే స్పందించి పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది.
