నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 17: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే టిడిపికి తప్పదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.శేబారాణి,సిఐటియు పట్టణ,మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు నక్కీ శ్రీకాంత్ అన్నారు.సోమవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించిన అనంతరం సిడిపిఓ శంషాద్ బేగం కి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డోన్ నాయకురాలు సులోచన అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పంద జీఓ లను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని,అంగన్వాడీలపై యాప్ ల భారాన్ని తగ్గించాలని,అంగన్వాడీలకు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలని,మినిసెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జి ఓ విడుదల చేయాలని,పెండింగ్లో వున్న సెంటర్ అద్దెలు,టి.ఏ,కూరగాయల బిల్లులు చెల్లించాలని,ప్రభుత్వమే ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని.మెనూ చార్జీలు పెంచాలని,ICDS బలో పేతానికి బడ్జెట్లో నిధులు పెంచాలని,సమ్మె కాలంలో మినిట్స్ రూపంలో చేసుకున్న ఒప్పందాలకు జి.ఓ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గతంలో టిడిపి ప్రభుత్వ హాయంలో అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టగా గుర్రాలతో నీటి ఫిరంగలతో దాడి చేసి ఇబ్బందులకు గురిచేసిన తర్వాత అధికారం కోల్పోవడం జరిగిందని అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వ హాయంలో 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మె చేస్తే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే గాక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లు ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఎస్మా ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫలితం అనుభవించిందని గుర్తు చేశారు.మేము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికార పార్టీ నాయకులు సమస్యలు పరిష్కరించకపోగా చిరు ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అదేదో తమ హక్కు అన్నట్లు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో బిజీగా ఉన్నారని ఇది సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశాలు ఉన్నచోట వారి మనుషులను ఎక్కించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ విధానాలు మార్చుకోవాలని లేనియెడల రాబోవు ఎన్నికలలో ప్రజలు వారి ఉద్యోగాలను ఊడగొట్టడం ఖాయమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గుల్జార్ బి,అనూష,సుమలత,శ్రీలక్ష్మి,రాజేశ్వరి,వరలక్ష్మి,సుబ్బలక్ష్మి,రమాదేవి, బేతంచెర్ల పట్టణంతో పాటు మండలంలోని రంగాపురం తదితర గ్రామాల నుండి 100 మంది దాకా అంగన్వాడీలు పాల్గొన్నారు.
