భారతదేశం నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. స్వదేశీ పరిజ్ఞానం, ఆలోచనలతో ముందుకెళుతూ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. దేశం ఆర్థికంగా మరింత పురోగతి సాధించాలంటే స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం చాలా అవసరం అని సామాజిక, సమరసత వేదిక తెలంగాణ ప్రాంత సంయోజక్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు.
స్వదేశీ మేళా కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ స్టేడియంలో ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాద్ జీ మాట్లాడుతూ—
✅ భారతదేశంపై గతంలో ఎన్నో దాడులు జరిగాయి, కానీ మనం నిలదొక్కుకొని, నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం.
✅ జపాన్‌పై అణుబాంబు దాడి జరిగిన తర్వాత, కొద్ది సంవత్సరాల్లోనే ఆ దేశం అన్ని రంగాల్లో అమెరికాతో పోటీ పడే స్థాయికి ఎదిగింది.
✅ భారతదేశం 250 ఏళ్లు విదేశీ పాలన అనుభవించింది. అయినా, మనం మళ్లీ లేచినాం.
✅ స్వదేశీ అంటే విదేశీ వస్తువులకు వ్యతిరేకం కాదు. కానీ, మన దేశంలో తయారైన వస్తువులను కొనడం మన బాధ్యత.
✅ 1947లో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తుల జాబితాలో 168వ స్థానంలో ఉంది, కానీ నేడు 5వ స్థానానికి ఎదిగింది.
✅ భారతదేశం 75 ఏళ్ల క్రితం గోధుమలు దిగుమతి చేసుకునేది. కానీ నేడు 102 దేశాలకు అన్నం ఎగుమతి చేస్తోంది.
ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలనీ, మన సంప్రదాయాలను గౌరవించుకుంటూ, భారతదేశ ఆర్థిక బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. స్వదేశీ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ మేళా కో కన్వీనర్ కళ్లెం వాసుదేవ రెడ్డి, స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ ముక్కహరీష్ బాబు, ముత్యాల జగన్ రెడ్డి, వసంత్ వ్యాలీ స్కూల్ కరస్పాండెంట్ ఇనుకొండ బుచ్చిరెడ్డి, సప్తగిరి హై స్కూల్ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
