వేములవాడ: రాష్ట్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం వేములవాడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పట్టభద్రుల సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో డీఎస్సీ జరుగగా, టీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్దంపాటు డీఎస్సీ నిర్వహించలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే డీఎస్సీ నిర్వహించి, 55,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు.
అదే విధంగా, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్‌గా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఫైనల్‌గా భావించాలని సూచించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి పట్టభద్రుని వద్దకు వెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు స్థానికులుకాదని, కానీ నరేందర్ రెడ్డి మాత్రం పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న స్థానిక అభ్యర్థి అని హైలైట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.
