ఖమ్మం: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా శాఖ అధికారులను కోరింది.
సంఘం ప్రతినిధులు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న జన్మించారని, ఆయన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధి చెందినట్టు తెలిపారు. బంజారాల్లో అపోహలు, మూఢనమ్మకాలను తొలగించి సంచార జీవన విధానాన్ని మార్చి తండాల్లో నివాసం ఉండేలా కృషి చేశారని గుర్తుచేశారు.
తల్లిదండ్రులను, స్త్రీలను గౌరవించాలని, ప్రకృతి మరియు వన్యప్రాణులను కాపాడాలని ఆయన బోధించారని, హింస పాపమని, మత్తు, ధూమపానం శాపమని హితవు పలికారని పేర్కొన్నారు. బంజారాలతో పాటు ఇతర వర్గాల ప్రజలకు కూడా సేవాలాల్ మహారాజ్ ఆదర్శపురుషుడయ్యారని వివరించారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఖమ్మం జిల్లాలోని అన్ని శాఖల బంజారా ఉద్యోగులు పాల్గొనేలా ప్రభుత్వ సెలవు ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాదావత్ శ్రీను, ప్రధాన కార్యదర్శి జాటోత్ వీరన్న, కోశాధికారి జరుపుల దేవా సింగ్, ఈసీ మెంబర్ మాళోత్ భాస్కర్ పాల్గొన్నారు.
