తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని , తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ది పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు . ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
జనవరి 20 నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతి తదితర అంశాలపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.
పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు.
గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కు ముందుకు రాగా, దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం కి వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని తెలిపారు. ప్రజా పాలన తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించనున్నారు. సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు , పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
