ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం పాలసీపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలించాలని చెప్పారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం అరికట్టడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో పీక్ డిమాండ్ 15,623 మెగా వాట్లకు చేరిందని, ఈ సారి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించగా, గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో పీక్ విద్యుత్ డిమాండ్ ఉంటుందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమం శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి ఏ విధానంలో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
